Education News | విద్యార్ధులపై పెట్టు డబ్బు ఖర్చుగా చూడవద్దు
Education News | విద్యార్ధులపై పెట్టు డబ్బు ఖర్చుగా చూడవద్దు
విద్యార్ధులపై పెట్టేది పెట్టుబడే..
సర్కారు పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన సిబ్బంది ఉంది
ఎందుకు ప్రైవేటు స్కూల్స్ తో పోటీ పడలేకపోతున్నాం
బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా గురుకులాలను తీర్చిదిద్దండి
ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ప్రజలలో విశ్వాసం పెంచండి
చిలుకూరు గురుకులంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad : రాష్ట్రంలో విద్యారంగం పై పెట్టే డబ్బులు ఖర్చు కాదని.. అది వారిపై పెట్టే పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ను ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్లలో ఒకే విధమైన మెనూ అమలు చేస్తున్నారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెనూ రూపొందించింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. గురుకులాల వ్యవస్థను పీవీ నరసింహారావు హయాంలో తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇటీవలే డైట్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు బాగున్నాయని అభినందించారు. విద్యార్థులకు ఆరు నెలల తరువాత పుస్తకాలు ఇస్తే ఏం ప్రయోజనమని అంటూ.. తమ ప్రభుత్వంలో స్కూల్ ప్రారంభమైన మొదటి రోజే పుస్తకాలు అందజేస్తున్నట్టు పాత రోజులు గురించి ప్రస్తావించారు.
గురుకులాల్లో చదివిన ఓ విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలనేదే తమ ప్రయత్నమని సీఎం చెప్పారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, మాజీ డీజీపీ మహేందర్రెడ్డి ఒకప్పటి గురుకులాల విద్యార్థులే అని చెప్పారు. వాటిలో చదివి ఎందరో ఉన్నతస్థాయికి చేరుకున్నారని వివరించారు. రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకున్న వాళ్లు ఎంతో మంది ఎంతో గొప్పగా రాణించినట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలలో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని అంటూ దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డైట్, కాస్మోటిక్, మౌలిక వసతులకు గత ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. కాని తమ ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు సింగిల్ స్ట్రోక్ లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచామన్నారు.
రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23లక్షలు విద్యార్థులు చదువుకుంటున్నారని, అలాగే 11వేల ప్రయివేటుశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రయివేట్ స్కూల్స్ లో చదువు చెప్పేవారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కు అర్హత ఉందా? అని ప్రశించారు రేవంత్ . అర్హత కలిగిన, నిష్టాతులైన ఉపాధ్యాయం వర్గం ఉన్నప్పటికీ మనం మల్టీ టాలెంటెడ్ స్థూడెంట్స్ ను ఎందుకు తయారు చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ విషయంపై ఆలోచన చేయాలని సూచించారు.
శ్రీమంతుడుకి , పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని అంటూ.. మనల్ని నమ్మి వాళ్లు ప్రభుత్వం హాస్టళ్లకు పంపితే మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం తెలిపారు. గురుకుల పాఠశాలలో జరుగుతున్న మరణాల వంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కుట్టు పనికి ఇచ్చే రుసుం రూ.25 నుంచి రూ.75 కు పెంచామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక వారంలో రెండు, మూడు రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు..
విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్న విద్యార్ధులలో నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోందని సీఏం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే దీనిని అధిగమించేందుకు రాష్ట్రంలో 75 ఐటీఐ లను టాటా సంస్థతో కలిసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనున్నామని తెలిపారు. దీంతో పాటుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాలను అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
2028 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం పేర్కొన్నారు. క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో నిఖత్ జరీన్, సిరాజ్ లాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.. విద్యార్ధులలో ఉన్న క్రీడా ప్రతిభను కూడా వ్యాయమ ఉపాధ్యాయులు గుర్తించి వారిని పొత్సహించాలని కోరారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి విద్యార్ధుల తో కలసి భోజనం చేశారు.
* * *
Leave A Comment